DEMOCRACY RIGHTS
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 1:55 am Posted by : DEMOCRACY RIGHTS

ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యాయం..  విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావం! పరివర్తన రాజనీతి పార్టీ’ PRP పేరుతో రాజకీయ అరంగేట్రం..  విజయవాడ ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ! రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడటమే లక్ష్యం..  యువతకు పెద్దపీట వేస్తామని విజయసాయిరెడ్డి ప్రకటన!

 

డెమోక్రసీ రైట్స్ ప్రతినిధి

రవికుమార్ ఎబ్బిలి

 

 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించింది.మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత వి. విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించారు.

 

తెలుపు కాషాయ రంగుల్లో పార్టీ జెండా

 

పరివర్తన రాజనీతి పార్టీ జెండాను తెలుపు, కాషాయ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో ధర్మచక్రం ఆకృతిని ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి అభిమానులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ పేరు,జెండా ఆవిష్కరణతో సభా ప్రాంగణంలో సందడి నెలకొంది.అభిమానులు నినాదాలతో తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.

 

రెండు కుటుంబాల ఆధిపత్యానికి స్వస్తి పలకాలి

 

పార్టీ ప్రకటన అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కుమారుడే ముఖ్యమంత్రి కావాలా? ప్రతిపక్ష నాయకుడి కుమారుడే ముఖ్యమంత్రి కావాలా? అంటూ ప్రశ్నించారు. ప్రజలకు కొత్త నాయకత్వాన్ని అందించాలనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించినట్లు తెలిపారు.

 

యువత రాజకీయాల్లో పెద్దపీట

 

యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన సమర్థులైన నాయకులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తాను ఒక్కడినే రాష్ట్రాన్ని మార్చేస్తానని చెప్పడం లేదని, ప్రజల భాగస్వామ్యంతోనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

 

తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నించాలి

 

అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను వినే, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, దేశభక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ తమ పార్టీ ప్రధాన ధ్యేయాలని స్పష్టం చేశారు.

 

మూడో ప్రత్యామ్నాయంగా పీఆర్పీ

 

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రత్యామ్నాయ వేదికగా పరివర్తన రాజనీతి పార్టీని తీర్చిదిద్దుతామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలకు ముందే తమ పార్టీ బలాన్ని చూపిస్తామని ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది.

కొత్త పార్టీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? పీఆర్పీ ప్రజల్లో ఎంతమేర ఆదరణ పొందుతుంది? అన్న అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.